ఇక బ్యాంకుల ఇష్టం చెల్లదు.. అవసరం లేని పాలసీలు, లోన్లు అంటగట్టొద్దు!: ఆర్‌బీఐ

  • బ్యాంకుల మిస్‌ సెల్లింగ్‌పై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు
  • లోన్‌ కోసం బీమా పాలసీ కొనాలని బలవంతం చేయొద్దు
  • ప్రతి ఉత్పత్తికి విడిగా కస్టమర్ అంగీకారం తప్పనిసరి
  • డిజిటల్ వేదికల్లో మభ్యపెట్టే పద్ధతులపై నిషేధం
  • 2027 జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు
బ్యాంకుకు ఓ పనిమీద వెళ్తే మరో ప్రొడక్ట్‌ను అంటగట్టడం, లోన్‌ తీసుకోవాలంటే బీమా పాలసీ తప్పనిసరి అని చెప్పడం, మొబైల్ యాప్‌ తెరిస్తే వరుసగా లోన్ ఆఫర్లు చూపించడం వంటి పద్ధతులకు త్వరలో చెక్ పడనుంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆర్‌బీఐ కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. బ్యాంకులు అనుసరించాల్సిన కొత్త మార్గదర్శకాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇప్పటి వరకు బ్యాంకింగ్ రంగంలో తరచూ వినిపించిన ఫిర్యాదుల్లో ‘మిస్‌ సెల్లింగ్‌’ ఒకటి. అంటే వినియోగదారుడికి అవసరం లేని ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్‌ను అమ్మడం. సరైన సమాచారం ఇవ్వకుండా ఒప్పించడం. అనుమతి లేకుండానే పాలసీలు లేదా ఇతర సేవలు జత చేయడం వంటి చర్యలు ఇందులోకి వస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు తొలిసారి స్పష్టమైన నిర్వచనం ఇచ్చిన ఆర్‌బీఐ వాటిపై కఠిన వైఖరి అవలంబించింది.

కొత్త నిబంధనల ప్రకారం రుణం మంజూరు చేయాలంటే తప్పనిసరిగా బీమా పాలసీ కొనాలని బ్యాంకులు షరతు విధించకూడదు. గృహ రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకునే సమయంలో బీమా అవసరమైతే వినియోగదారుడు తనకు నచ్చిన సంస్థ నుంచి పాలసీ తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. బ్యాంకు సూచించిన సంస్థ నుంచే కొనాలంటూ ఒత్తిడి చేయడం నిషేధం.

వినియోగదారుడి సమ్మతికి కూడా కొత్త నిర్వచనం తీసుకొచ్చింది ఆర్‌బీఐ. ఒక ఉత్పత్తికి ఇచ్చిన అంగీకారాన్ని మరో ప్రొడక్ట్‌ను వర్తింపచేయకూడదు. రుణం తీసుకున్న వ్యక్తికి అదే ఆధారంగా బీమా, పెట్టుబడి పథకాలు లేదా ఇతర ఆఫర్లను పంపడం కుదరదు. ప్రతి ఉత్పత్తికి విడిగా స్పష్టమైన అనుమతి తీసుకోవాల్సిందే.

డిజిటల్ వేదికల్లో బ్యాంకులు అనుసరిస్తున్న పలు పద్ధతులపై కూడా ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. కస్టమర్లను మభ్యపెట్టేలా కౌంట్‌డౌన్ టైమర్లు చూపించడం, ముందుగానే టిక్ చేసిన ఆప్షన్స్‌ ఉంచడం, తిరస్కరించే బటన్‌ను గందరగోళంగా చూపించడం, మూసివేయాలనుకుంటే లోన్ పేజీకి తీసుకెళ్లే పాప్‌అప్‌లు చూపించడం వంటి పద్ధతులను నిషేధించింది.

లోన్ దరఖాస్తు సమయంలో వినియోగదారుడికి తెలియకుండా బీమా పాలసీని జత చేయడం, చివరి దశలో అదనపు ఛార్జీలను చూపించడం, అత్యవసర హెచ్చరికలా కనిపించే ప్రకటనలు పంపించడం వంటి చర్యలు కూడా ఇక అనుమతించబోవడం లేదు. బ్యాంకుల తరఫున పనిచేసే డైరెక్ట్ సేలింగ్ ఏజెంట్లు, మార్కెటింగ్ ప్రతినిధులపైనా కొత్త నియంత్రణలు అమల్లోకి రానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే వినియోగదారులను సంప్రదించాలి. అనుమతి లేకుండా ఇంటికి లేదా కార్యాలయానికి వెళ్లకూడదు. తమను బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకోవడం కూడా నిషేధం.

ఈ మార్గదర్శకాల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి వినియోగదారుడికి తప్పుడు ప్రొడక్ట్‌ను విక్రయించినట్లు తేలితే బ్యాంకు వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. వినియోగదారుడు ఎదుర్కొన్న నష్టానికి పరిహారం కూడా ఇవ్వాల్సి రావచ్చు.

RBI
Bank Miss-selling Rules
Banking Regulations 2027
Loan Insurance Policy
RBI Digital Lending Guidelines
Consumer Protection Banking

More Telugu News